Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నయీంనగర్
పుస్తక పఠనమే మేలని డీసీపీ కేఆర్ నాగరాజు విద్యార్థులకు సూచించారు. గ్రంథా లయ వారోత్సవాల్లో భాగంగా హన్మకొండ సెంట్రల్ లైబ్రరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్మార్ట్ ఫోన్‌ల కంటే పుస్తకాల పఠనానికే అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. స్మార్ట్‌ఫోన్‌లతో ఉపయోగాలున్నా, సమయపాలన కరువైంద న్నారు. అత్యంత విలువైన సమయాన్ని విద్యార్థు లు వృథా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాల పఠనం ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించొచ్చన్నారు. నవతెలంగాణ పబ్లిషిం గ్ హౌజ్ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను పుస్తక ప్రియులు, విద్యార్థులు వినియోగిం చుకోవాలన్నారు. పబ్లిషింగ్ హౌజ్ నిర్వాహకుల కృషి అభినందనీయమన్నారు. అనంతరం వరంగల్ అర్భన్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ మహ్మద్ అజీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. విద్యార్థులు, పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించడంపై వారి తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. పుస్తక పఠనంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ పుస్తక ప్రదర్శనలో ప్రత్యేక డిస్కౌంట్‌ల ద్వారా పుస్తకాలు పొందొచ్చన్నారు. అనంతరం నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ జిల్లా మేనేజర్ బండారి బాబు మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన ఉంటుందని పదిశాతం డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. ఇందులో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీనిని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై వ్యాస రచన పోటీలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఎం అలివేలు పాల్గొన్నారు.