Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
- జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-భూపాలపల్లి
సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రతినెలా ఏడో తేదీలోగా జీతాలు చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు జీఎం కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడారు. భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతంలో 20 ఏండ్లుగా వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు వేతనాలు సరిగా అందక దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా జీతాలు సకాలంలో చెల్లించడం లేదని తెలిపారు. రోడ్లు ఊడ్చి, మురికి కాల్వల్లో పని చేసి కార్మికులు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. పని ప్రదేశాల్లో తాగునీటి, టెంట్, ఇతర సదుపాయాలు కల్పించడాన్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సకాలంలో వేతనాలు చెల్లించడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరింత పెద్దఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జీఎం కార్యాలయం అధికారులు గేట్ వద్దకు వచ్చి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తీసుకున్నారు. సమస్యలను యాజమాన్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు బొట్ల చక్రపాణి, నాయకులు రామస్వామి, మొగిలి, రాజయ్య, బాబు, రవి, సమ్మయ్య, సారమ్మ, శారద, ఉమ, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో పాదయాత్ర
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మిక జేఏసీతో చర్చలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా తహసీల్దార్, జీఎం కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సాయిలు మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొట్ల చక్రపాణి, నాయకులు రాజయ్య, కృష్ణ, రజాక్, రామస్వామి, రమేష్, శేఖర్, శ్రీనివాస్, సురేష్ పాల్గొన్నారు.