Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపర్ స్పెషాలిటీకి మంగళం
- లక్ష ఎకరాలకు సాగునీరు హామీ గాలికి
- రెండో రాజధాని అంటూ అభివృద్ధిపై నిర్లక్ష్యం
- ఊసేలేని రుణమాఫీ
- ఇప్పటికీ అందరి ఖరీఫ్ రైతుబంధు
- డబల్ బెడ్‌రూంకు నోచని పేదలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు అటకెక్కాయి. రెండోసారి సీఎంగా ఏడాది పూర్తి చేసుకున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాత్రం అమలుకు నోచలేదు. వరంగల్ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ అస్పత్రికి మంగళం పాడారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామన్న మాట నిలుపుకోలేదు. వరంగల్‌ను రెండో రాజధాని అన్న కేసీఆర్ అభివృద్ధి మాట మరిచారు. రుణమాఫీ ఊసేలేదు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు పేదలకు దక్కలేదు. రైతు బంధు పథకాన్ని సక్రమంగా అమలు చేయడమూ లేదు. ఖరీఫ్‌కు ఇవ్వాల్సిన పెట్టుబడి రబీ మొదలైనా ఇవ్వలేదు. ఇలా ఏడాదిలో కేసీఆర్ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని పలువురు విమర్శిస్తున్నారు.
కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తయ్యింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చారు. ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కానీ ఇప్పటికీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇంతెందుకు భూ సేకరణ పూర్తి కాలేదు. సాగునీటి వసతి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకోలేదు. దేవాదుల, కంతనపల్లి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి.
దేవాదులపై నిర్లక్ష్యం
దేవాదుల ప్రాజెక్టును 2004లో చేపట్టారు. 6.21లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టగా ఇప్పటికీ పూర్తి కాలేదు. రూ.6వేలా 16 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టగా ఏటేటా పెరుగుతున్నాయి. ఇప్పుడు రూ.14వేల కోట్లకు చేరింది. 38.182 టీఎంసీల నీటిని వినియోగించుకోవాల్సి ఉండగా ఇప్పటికీ రెండు, మూడో దశ పనులు పూర్తి కాలేదు. దేవాదుల పూర్తి కావడం వలన వరంగల్‌లో 5లక్షలా 61వేలా 229 ఎకరాలకు, కరీంనగర్‌లో 14వేల 100 ఎకరాలకు, నల్లగొండలో 45వేల 671 ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. బడ్జెట్‌లోనూ కోతలు పెడుతూ కాలయాపన చేస్తున్నారు. కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ దేవాదులపై పెడితే ఎప్పుడో పూర్తయ్యేది.
సూపర్ స్పెషాలిటీకి మంగళం
వరంగల్‌లో ఎంజీఎం ఆస్పత్రి ఉంది. అయితే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలును తరలించేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఉన్న ఎంజీఎంను పట్టించుకోవడం లేదు. సుమారు 600 మందికి పైగా ఉద్యోగ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పిల్లల వార్డుల్లో వెంటిలేటర్స్ కొరత ఉంది. ప్రతి నెలా 400 మందికి పైగా చనిపోతున్నా పట్టించుకోవడం లేదు. గుండె జబ్బుల చికిత్సలు ఇప్పటికీ ప్రారంభించలేదు. ఇప్పటికైనా వరంగల్ కేంద్రంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేస్తేనే ఉమ్మడి వరంగల్ ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది.
అమలు కానీ లక్ష ఎకరాలకు సాగునీరు హామీ
ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోనూ లక్ష ఎకరాలకు నీరందించలేని పరిస్థితి. దేవాదుల ద్వారా చెరువులు నింపుతున్నా ఆశించిన మేరకు పంటలు సాగు కావడం లేదు. దేవాదుల పూర్తి చేస్తే 6.21 ఎకరాలకు నీరందనుంది. వృథాగా పోతున్న గోదావరి జలాలను తరలించకపోవడంతో బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు కాదుకదా 10వేల ఎకరాలకు నీరందని పరిస్థితి.
ఊసేలేని రుణమాఫీ
ఒకేసారి లక్ష రూపాయలు మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు. బ్యాంకులు బుక్ అడ్జెస్ట్‌మెంట్లు చేశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5లక్షల మందికి పైగా రైతులు ఉండగా రుణమాఫీ వలన 4.50లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. రుణమాఫీపై టీఆర్‌ఎస్ నాయకులు సైతం నోరు విప్పడం లేదు. రుణమాఫీని కేసీఆర్ ఎన్నికల హామీగానే ఉంచారు తప్ప అమలు చేయలేదు.
నేటికీ అందని పెట్టుబడి
కేసీఆర్ ఇచ్చిన హామీల్లో పింఛన్ల పెంపు మాత్రమే అమలైంది. మిగతా వాటిలో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5లక్షల మందికి పైగా రైతులు ఉండగా ఇప్పటికీ 2లక్షల మందికి పెట్టుబడి సహాయం అందలేదు. ఒక్క జనగామ జిల్లాలోనే 59 కోట్ల పెడింగ్ ఉంది. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. రైతు బీమా వర్తింపజేస్తున్నా అనేక ఆంక్షలు పెట్టారు. పట్టా ఉండడమే కాదు బాండు ఉన్న వారికే సహాయం అందుతుంది. ఇక పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం చివరకు పెట్టుబడి సహాయం కూడా సకాలంలో అందించడం లేదు.
అతీగతీ లేని డబుల్‌బెడ్‌రూం ఇండ్లు
మొదటి దఫానే కాకుండా రెండో దఫా ఎన్నికల్లోనూ గెలవడానికి కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్ల హామీ ఇచ్చాడు. ఎక్కడా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయలేదు. స్టేషన్‌ఘనపూర్ మండలం రాఘవాపూర్, పాలకుర్తి నియోజకవర్గంలో రాఘవాపూర్‌లో ఇండ్లు పూర్తి చేసినా పంపిణీ చేయని పరిస్థితి. ఇక మిగతా గ్రామాల్లో ఇండ్ల హామీ అలాగే ఉంది. ఉమ్మడి జిల్లాలో 2లక్షలా 90వేల కుటుంబాలు డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ఇప్పటికీ డబుల్‌బెడ్‌రూం ఇండ్లు పేదల దరి చేరలేదు.
కాంట్రాక్టర్లకు వరంగా మిషన్ కాకతీయ
మిషన్ కాకతీయ పథకం కాంట్రాక్టర్లకు వరంగా మారిగింది. చెరువుల నిండి పంటలు పండుతాయని రైతులకు హితబోధ చేశారు. కేసీఆర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6వేలా 714 చెరువులు, కుంటలు ఉండగా 4లక్షలా 16వేలా 663 ఎకరాల్లో సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి విడతలో 1024 చెరువులకు వెయ్యి చెరువులుపూర్తి చేశారు. రెండో విడతలో 1044 చెరువులకు 1001 చెరువుల్ని పూర్తి చేశారు. మూడో విడతలో 616 చెరువులకు 410 చెరువుల్ని పూర్తి చేశారు. నాల్గో విడతలో 581 చెరువులకు టెండర్లు పూర్తి చేసి పనులు నిర్వయిస్తున్నారు. మిషన్ కాకతీయకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయగా కేవలం కాంట్రాక్టర్లకే ప్రయోజనం కలిగింది.
వరంగల్‌పై గాలి మాటలు
హైదరాబాద్ తరువాత అతి పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతి బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయిస్తామని హామీ ఇవ్వగా కేటాయిస్తున్నారు. అయితే రోడ్ల అభివృద్ధి జరగడం లేదు. పార్కు, పారిశ్రామిక కారిడార్, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, నాలుగు లైన్ల రహదారి వంటివి ఇంకా పెడింగ్‌లోనే ఉన్నాయి. వరంగల్ నగరం విషయంలో ప్రత్యేక సమీక్షలు చేసిన పరిస్థితి కూడా లేదు.