Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 దేశాల్లో కరువు పరిస్థితులు : ఐరాస
- 25కోట్ల మందిలో పౌష్టికాహారలోపం
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆకలి సంక్షోభం తలెత్తే అవకాశముందని ఐక్యరాజ్యసమితికి చెందిన పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత, కరోనా...వరుస సంక్షోభాల వల్ల 20 దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ దేశాల్లోని 25కోట్లమంది పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారని ఐరాస ఏజెన్సీలు గుర్తించాయి. యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణ సూడాన్, ఇథోపియా, నైజీరియా, కాంగో, బుర్కానా ఫాసో..దేశాల్లో పరిస్థితులు తీవ్రతరమయ్యాయని, దాంతో ఐరాస మానవతా విభాగం ఆ దేశాలకు అత్యవసర సాయం కింద 100 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.742 కోట్లు) విడుదల చేసినట్టు ఐరాస తెలిపింది. దీనిపై ప్రపంచ ఆహార కార్యక్రమం చీఫ్ డేవిడ్ బీస్లే మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బిలియన్ డాలర్లు (లక్షల కోట్ల రూపాయలు..) నిధులు ఖర్చు చేయక తప్పదు. లేదంటే 2021కల్లా అనేక దేశాల్లో కరువు తీవ్రరూపం దాల్చేట్టు ఉంది..అని అన్నారు. అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత అనేక దేశాల్ని తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికి తోడు కరోనా వైరస్ రావటం వల్ల ప్రజలు పెద్ద సంఖ్యలో పేదరికంలోకి కూరుకుపోయారు. ఆహారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఐరాస ఏజెన్సీలు గుర్తించాయి. గతకొన్నేండ్లుగా దక్షిణ సూడాన్ అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతోంది. వరుసగా సంక్షోభాలు చుట్టుముడుతున్నాయని ఐరాస తెలిపింది. ఈ దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడే రోజు ఎంతో దూరంలో లేదని సమాచారం.
రోజుకు ఒకపూట భోజనం : ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు
రాజధాని కాబూల్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. కరోనా వల్ల ఉపాధి పోయింది. రోజు కూలీ చేసుకుందామని వీధుల్లో తిరుగుతున్నా. నాలుగు రోజులకోమారు పని దొరుకుతోంది. దాంతో ఇంటివద్ద పిల్లలతో సహా అందరూ ఒకపూట భోజనంతో సరిపెట్టుకుంటున్నారు.