Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అధికార బదలాయింపు క్రమాన్ని ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారులను ఆదేశించారు. అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ శ్వేత సౌధంలోకి మారడానికి అవసరమైన ప్రభుత్వ వనరులను అందచేస్తామని సంబంధిత ఫెడరల్ సంస్థ చీఫ్ ప్రకటించిన తర్వాత ట్రంప్ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఎన్నికల అవకతవకలపై తన పోరాటం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో పరాజయాన్ని ట్రంప్ ఇప్పటికీ అంగీకరించడం లేదు. అధికార బదలాయింపు క్రమాన్ని ట్రంప్ బృందం నిలువరిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ పలు రాష్ట్రాల్లో ట్రంప్ బృందం పిటిషన్లు దాఖలు చేసింది. కానీ అందులో చాలా వాటిని కోర్టులు కొట్టివేశాయి. కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో తాను అధ్యక్షుడిగా కొనసాగుతానా లేదా అనేది కాలమే చెబుతుందని ట్రంప్ గత వారం వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలనంటూ ధీమా వ్యక్తం చేసిన ట్రంప్ వైఖరిలో వచ్చిన మార్పును ఈ వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి. ఆలస్యంగా వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలన్న సుప్రీం నిర్ణయాన్ని రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అయితే పెన్సిల్వేనియాలో ఫలితాన్ని మార్చేంతగా ఆ బ్యాలెట్లు లేవనేది స్పష్టమైంది. పెన్సిల్వేనియా ఎన్నికపై 15కి పైగా పిటిషన్లు వేశారు. కానీ ఎక్కడా కూడా అక్రమాలు జరిగాయనడానికి సరైన సాక్ష్యాధారాలు లభించలేదు.
బైడెన్ క్యాబినెట్
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడోన్ నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. క్యాబినెట్‌లోకి తీసుకున్న మంత్రుల పేర్లను తాజాగా బైడెన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖను ఆంటోనీ బ్లింకెన్‌కు అప్పగించగా.. అంతర్గత భద్రత మంత్రిగా ప్రముఖ న్యాయవాది అలెజాండ్ర మాయోర్కస్‌ను ఎంపిక చేశారు. జాతీయ భద్రత సలహాదారుగా బైడెన్ సలహాదారుడైన జేక్ సులివాన్‌ను నియమించారు. సీఐఏ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అవ్రిల్ హేన్స్‌ను జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. సుదీర్ఘకాలం దౌత్యవేత్తగా పనిచేసిన లిండా థామస్ గ్రెన్‌ఫీల్డ్‌ను ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించారు. వీరంతా 2009-2017 మధ్య ఒబామా - బైడెన్ ప్రభుత్వంలో పనిచేసిన వారే కావడం గమనార్హం. మంత్రివర్గ బృందం తమ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తుందని విశ్వసిస్తున్నా' అని బైడెన్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి జాస్‌కెర్రీని క్యాబినెట్‌లోకి తీసుకునీ.. ప్రత్యేకంగా పర్యావరణ రాయబారిగా కీలక బాధ్యతల్ని అప్పగించారు.