Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా దిగుమతులపై రచ్చ..
- సభలో పంది మాంసాన్ని విసిరిన సభ్యులు
తైపే : అమెరికా నుంచి పంది మాంసం దిగుమతులను జనవరి 1 నుంచి అనుమతిస్తామంటూ ఆగస్టులో అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో తైవాన్ పార్లమెంట్‌లో శుక్రవారం రణరంగాన్ని తలపించే దృశ్యాలు కనిపించాయి. ప్రధాన ప్రతిపక్షం కేఎంటీ పార్టీ సభ్యులు పంది అవయవాలను విసురుతూ ఇతర సభ్యులపై ముష్టిఘాతాలు చేస్తూ ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. చైనా, యురోపియన్ యూనియన్‌లో నిషేధించబడిన రాక్టోపామైన్ ప్రిజర్వేటివ్స్ కలిగివున్న పంది మాంసాన్ని, 30నెలలకు పైబడిన గొడ్డు మాంస దిగుమతులను అనుమతిస్తామని అధ్యక్షుడు త్సాయి ఇంగ్ వెన్ ప్రకటించారు. కాగా ఈ నిర్ణయాన్ని కేఎంటీ తీవ్రంగా వ్యతిరకిస్తోంది. ఇటీవల కాలంలో పలు కుంభకోణాలు జరిగిన నేపథ్యంలో ఆహార భద్రతపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. సెప్టెంబరు మధ్యలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ కేఎంటీ తన నిరసన తెలియచేస్తూనే వుంది. ప్రధాని మాట్లాడుతుండగా, పోడియం మధ్యకు వచ్చి సభ్యులు అడ్డగించారు. ఈ నిరసనలతో విసిగిపోయిన పాలక పక్షం శుక్రవారం ప్రధాని దీనిపై ప్రసంగిస్తారని చెప్పింది. ప్రధాని వస్తుండగా, కేఎంటీ సభ్యులు ఈలలు వేస్తూ, బ్యానర్లు ప్రదర్శిస్తూ గొడవ చేశారు. కాగా ప్రధాని చుట్టూ మార్షల్స్ అడ్డుగా నిలబడి ఆయనను లోపలకు తీసుకువచ్చారు. ప్రధాని మాట్లాడడం ప్రారంభిం చిన వెంటనే కెేఎంటీసభ్యులు పంది అవయవాలను విసిరారు. రెండు పార్టీలకు చెందిన సభ్యుల్లో కొంతమంది పరస్పరం చేయి చేసుకున్నారు. ప్రధాని ప్రసంగం వెంటనే నిలిపివేసి సభ్యుల ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ప్రారంభించారు. కానీ ఆ గందరగోళంలో ఏమీ వినిపించలేదు. పాలక పక్షం ఈ నిరసనలను ఖండించింది. ఇలా పంది అవయవాలను విసిరివేయడం వల్ల ఆహారం వృథా అవుతుందని ఒక ప్రకటనలో ఖండించింది. అర్ధవంతమైన చర్చకు రావాలని కోరింది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు, ఆహార భద్రతను కాపాడేందుకు గానూ ప్రతిపక్ష పార్టీ ప్రతిఘటిస్తుందని కేఎంటీపేర్కొంది.