Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పెయిన్‌లో పోలీసులకు నిరసనకారులకు మధ్య ఘర్షణలు
- పలువురికి తీవ్ర గాయాలు.. 100 మందికి పైగా అరెస్టు
మాడ్రిడ్: పాప్ సింగర్ పాబ్లో హాసిల్ అరెస్టుకు నిరసనగా గత ఆరు రోజులుగా జరుగుతున్న ఆందోళనలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. బార్సిలోనాలో వారం రోజులుగా ఈ నిరసనలు హింసాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. స్పానిష్ నగరంలో పాబ్లో మద్దతుదారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణలకు దారీ తీసింది. పాబ్లో హాసిల్ మద్దతుదారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాల వైపు వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు.
చాలా ప్రాంతాల్లో పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నల్లటి దుస్తులు ధరించిన నిరసనకారులు సిటీ సెంటర్ గుండా పోలీసు ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఆందోళకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు పోలీసులపై రాళ్లు, సీసాలు విసిరారు. నగరంలోని పలు దుకాణాల కిటికీలను ధ్వంసం చేశారు. కాగా, ఇప్పటివరకు దాదాపు 100కి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నిరసనలు రోజురోజుకు మరింత ఉధృతం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. అల్లర్లు చెలరేగకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. కాగా, పాప్ సింగర్ ప్లాబో హాసిల్.. స్పానిష్ చక్రవర్తిని అవమానిస్తూ.. రాచరికాన్ని ప్రశ్నిస్తూ.. ఉగ్రవాదులను కీర్తించాడని ఆరోపిస్తూ.. ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.