Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మయన్మార్‌లో కొనసాగుతున్న ఆందోళనలు
- పోలీస్ కస్టడీలో సూకీ పార్టీ నేత అనుమానాస్పద మృతి
- వివిధ పార్టీల నేతల ఇండ్లపై సైన్యం దాడులు
యాంగాన్: మయన్మార్‌లో ఆందోళనలు మరింత ఉధృతరూపం దాల్చాయి. సైనిక నిర్బంధంలో ఉన్న మయన్మార్ నేత ఆంగ్‌సాన్ సూకీ సహచరుడు, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డి) సీనియర్ నేత కిన్ మవాంగ్ లాట్ శనివారం రాత్రి పోలీస్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. దీనికితోడు వివిధ పార్టీల నేతలు, ఉద్యమ కార్యకర్తలపై సైన్యం గత రాత్రి ఎడాపెడా దాడులు చేస్తూ పలువురిని నిర్బంధించడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. కిన్‌మవాంగ్ లాట్ తలపైన, శరీరంపైన ఉన్న గాయాలను బట్టి ఆయనను సైన్యమే హతమార్చిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దయెత్తున వీధుల్లోకి వచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు సోమవారం నుంచి దేశవ్యాపితంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించాయి. నిరసనకారులను పిట్టలను కాల్చినట్లు కాల్చివేస్తున్న సైనిక నియంత చర్యను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. నిరసనకారుల్ని కాల్చి చంపడాన్ని వెంటనే ఆపాలని భద్రతామండలి ఆదేశించింది. సైనికుల్ని, పోలీసుల్ని పెద్ద యెత్తున మోహరిం చినా, భద్రతా దళాలు విచ్చలవిడి దాడులతో ఎంత భయోత్పాతం సృష్టించినా తాము వెరవబోమని ప్రజలు వీధుల్లోకి వచ్చి నినదిస్తున్నారు. ఆదివారం యాంగాన్‌తో సహా ఓ అరడజనుకు పైగా నగరాల్లో భారీ నిరసన ప్రదర్శనలతో హోరెత్తాయి. మయన్మార్‌లో ఉత్తరాదిన ఉన్న షాన్ ప్రాంతంలోని లాషియో పట్టణంలో నిరసనకారులపై సైన్యం బాష్పవాయు గోళాలను, స్టన్ గ్రనేడ్లను ప్రయోగించిన దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెంపుల్ టౌన్ బగాన్‌లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరం మండాలేలో హక్కుల కార్యకర్తలు గుమికూడి పోలీసులు, ఆర్మీ కాల్పుల్లో మరణించినవారికి నివాళులర్పించారు. ఫిబ్రవరి1న ఆంగ్‌సాన్ సూకీని సైన్యం తొలగించి,నిర్బంధంలోకి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు మిలిటరీ ప్రభుత్వం సాగించిన దమనకాండలో 50మంది వరకు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తెలిపింది.
సైన్యంపై చర్యలు తీసుకోవాలి
మయన్మార్‌లో ఆందోళనకారుల హత్యకు పాల్పడుతున్న సైన్యంపై చర్యలు తీసుకోవాలని ఐరాస ప్రత్యేక రాయబారి క్రిస్టిన్ స్క్రానర్ బర్గనెర్ భద్రతా మండలిని కోరారు. శుక్రవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో బర్గనెర్ మాట్లాడుతూ 'సైనిక దుశ్చర్యలను మనం ఇలా ఇంకెంత కాలం చూస్తూ ఉండాలి' అని అన్నారు.