Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్‌సాల్విడార్, హైతీ, ఆఫ్రికా దేశాల ప్రజలనుద్దేశించి ట్రంప్ దారుణ వ్యాఖ్యలు
- ఆ దేశాల నుంచి వలసల్ని అడ్డుకోవాలని వాఖ్యలు
- ట్రంప్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. హైతీ, ఎల్‌సాల్విడార్, ఆఫ్రికా పేద దేశాల వలసదారుల్ని చులకనచేసి మాట్లాడారు. చెత్త దేశాలు (షిట్...హోల్)..చెత్త మనుషులు అనే భావం వచ్చేట్టు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది చెందిన దేశమైన అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడేంటి ? అని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. వాషింగ్టన్ పోస్ట్ అందించిన సమాచారం ప్రకారం అతి చెత్త(షిట్ హోల్) దేశాలనుంచి ఇమ్మిగ్రెంట్స్ అమెరికాకు ఎందుకు వస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై డెమెక్రాట్లు, ఇతర రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. ట్రంప్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైతీ, ఎల్ సాల్వడార్, ఆఫ్రికన్ దేశాలనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని బీబీసి రిపోర్ట్ చేసింది. వీరికి బదులుగా నార్వే లాంటి దేశాల నుంచి వలస వచ్చిన వారిని నియమించుకోవాలని ట్రంప్ తన సభ్యులకు సూచించారు. గురువారం ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన మేరీల్యాండ్ డెమోక్రాటిక్ చట్టసభ సభ్యుడు ఎలిజా కమ్మింగ్స్ ట్వీట్ చేశారు. ఇది క్షమించరాని ప్రకటన అంటూ తీవ్రంగా ఖండించారు. ఉటా రాష్ట్ర రిపబ్లికన్, కాంగ్రెస్‌లో ఏకైక హైతీ-అమెరికన్ మియా లవ్ ఇవి దుర్మార్గమైన, విభజన, అహంకార పూరిత వ్యాఖ్యలని మండిపడ్డారు. వెంటనే ట్రంప్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' అజెండా...నిజంగా 'మేక్ అమెరికా వైట్ ఎగైన్ ఎజెండా' అని మరోసారి రుజువైందని బ్లాక్ డెమోక్రాటిక్ శాసనసభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్ విమర్శించారు. జాత్యహంకారంతో అధ్యక్షుడు ట్రంప్ మరింత దిగజారిపోతున్నారని జాతీయ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ అఫ్ కలర్డ్ పీపుల్ ఆరోపించింది. ట్రంప్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంటే, శ్వేతసౌధం ఆయన్ని వెనకేసుకొచ్చింది. కొంతమంది వాషింగ్టన్ రాజకీయవేత్తలు విదేశాల కోసం పోరాటం చేస్తోంటే..అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ ప్రజల కోసం పోరాడుతున్నారని శ్వేతసౌధం ప్రతినిధి రాజ్ షా ఒక ప్రకటనలో తెలిపారు.
మన దేశ విలువలకు విరుద్ధం : రిపబ్లికన్ పార్టీ నాయకులు
రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి మియా లవ్ దీనిపై స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చాలా దయలేనివిగా, సమాజాన్ని విభజించేవిగా ఉన్నాయని, మన దేశ విలువలకు ఇవి విరుద్ధమని అన్నారు. మియా లవ్ హైతీ నుంచి అమెరికాకు వలస వచ్చిన కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలాంటి భాష వాడటం నీచమైనదని మరో రిపబ్లికన్ ప్రతినిధి ఇలియానా రోస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈమె క్యూబా నుంచి అమెరికా వలస వచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు జాతి వివక్షే అవుతాయని డెమొక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతాల్ విమర్శించారు.
ఆ చెత్త దేశాల.. వలసదారులు మాకెందుకు?
హైతీ, ఆఫ్రికాలాంటి దేశాల వాళ్లను అసలు అమెరికాలో ఎందుకు అడుగు పెట్టనివ్వాలి అంటూ ట్రంప్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన వాటిని షిట్‌హోల్ కంట్రీస్ అంటూ చులుకనగా మాట్లాడారు. శ్వేతసౌధంలో డెమొక్రటిక్ పార్టీ సెనేటర్ డిక్ డర్బిన్, రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం కొత్తగా రూపొందించిన ఇమ్మిగ్రేషన్ విధానంపై వివరిస్తున్న సమయంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. నార్వేలాంటి దేశాల నుంచి ఎక్కువ మంది రావాలిగానీ, హైతీ, ఎల్‌సాల్విడార్ నుంచి వలసదారుల రావాలా ? ట్రంప్ ప్రశ్నించారు. నైపుణ్యం లేని ఇలాంటి వాళ్లను అనుమతివ్వడం కంటే.. మంచి నైపుణ్యం ఉన్న దేశాల నుంచి నిపుణులకు అనుమతివ్వడం మేలని ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ చట్ట ప్రతినిధులతోపాటు డెమొక్రటిక్ పార్టీకి చెందినవాళ్లు కూడా తీవ్రంగా మండిపడ్డారు.
ఆయన వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటు : ఐరాస
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల పట్ల ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఒకవేళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే, అవి షాక్‌కు గురిచేస్తున్నాయని, చాలా సిగ్గుచేటు అని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవహక్కుల సంఘం పేర్కొన్నది. ట్రంప్ వ్యాఖ్యలు అనేక మంది జీవితాలను నాశనం చేసే విధంగా ఉన్నాయని ఐరాస పేర్కొన్నది. చాలా నీచమైన భాషను ట్రంప్ వాడుతున్నారని ఆరోపించింది. ఇవే వ్యాఖ్యల పట్ల ఆఫ్రికా దేశాలు కూడా స్పందించాయి. ట్రంప్ వ్యాఖ్యలు తీవ్రమైన అభ్యంతరకరంగా ఉన్నాయని ఆఫ్రికా యూనియన్ కూడా రియాక్ట్ అయ్యింది. అభివద్ధి చెందుతున్న దేశాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయని, అగ్రరాజ్యం అమెరికాలోనే దారిద్య్రం ఉన్నదన్న విషయం మరవరాదు అని ఆఫ్రికా యూనియన్ పేర్కొన్నది.