Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29 మంది మృతి, 48 మందికి గాయాలు
సనా : యెమెన్‌లో సాద ప్రావిన్స్‌లోని ఓ స్కూల్ బస్సుపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 29 మంది మృతి చెందగా, మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి ఘనీ నాయబ్ తెలిపిన వివరాల ప్రకారం...హౌతి తిరుగుబాటు దారుల జనాభా అధికంగా ఉన్న సాద ప్రావిన్స్‌లో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ సమీపంలో గురువారం వైమానిక దాడి జరిగింది. చిన్నారులతో ప్రయాణిస్తున్న ఓ బస్సుపై వైమానిక దాడి జరగడంతో 29 మంది మృతి చెందారు. 48 మంది గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఈ ఘటనకు పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ ప్రకటించు కోలేదు. సౌదీ సంకీర్ణదళాలే ఈ దాడికి పాల్పడి ఉంటాయని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. వైమానిక దాడిలో మృతి చెందిన చిన్నారులల్లో అత్యధిక శాతం మంది 10ఏండ్ల లోపు చిన్నారులే ఉన్నారని అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఖురాన్ పఠనం ముగించుకొని తమ ఇండ్లకు తిరిగివెళ్తున్న క్రమంలో ఈ దాడి జరిగిందని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థ తెలిపింది. కాగా, యెమెన్‌లోని తిరుగుబాటు దారులను లక్ష్యంగా చేసుకొని సౌదీ సంకీర్ణదళాలు గత కొంతకాలం నుంచి వైమానిక దాడులకు పాల్పతున్నాయి. అయితే, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, రద్దీగా ఉండే మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో, వందలాది మంది అమాయక ప్రజలు మృతి చెందారు.