Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 మంది మృతి
కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. దేశ రాజధాని కాబూల్‌కు సమీపంలోని షిటీ నగరంలో పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 20 మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు స్థానిక జర్నలిస్టులు ఉన్నట్టు సమాచారం. కాబూల్ సమీపంలోని దస్త్ ఈ బార్కి ప్రాంతంలో తొలుత పేలుడు సంభవించింది. స్థానిక జిమ్‌లో రెజ్లింగ్ మ్యాచ్ జరుగుతుండడంతో జనం గుమిగూడారు. ఓ సూసైడ్ బాంబర్ అక్కడకు చేరుకున్నాడు. బయట ఉన్న గార్డు మీద కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం జనం మధ్యలోకి వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 18 మంది మృతిచెందినట్టు హోంమంత్రి నజ్రత్ రహీమీ తెలిపారు. అయితే, ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో మరో పేలుడు సంభవించింది. రెండోసారి కారుబాంబు పేలిందని మంత్రి తెలిపారు.
ఈ పేలుడులో సమీమ్ ఫర్మార్జ్ (28), రమీజ్ అహ్మదీ (23) అనే ఇద్దరు జర్నలిస్టులు మృతిచెందారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. రెండు ఘటనల్లో సుమారు 70 మంది వరకు గాయపడినట్టు సమాచారం. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడులకు పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. ఇటీవల కాబూల్, పరిసర ప్రాంతాల్లో దాడులు పెరిగిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక ముష్కరమూకలు ఈ దాడులు చేస్తున్నాయి. అఫ్ఘాన్ ప్రభుత్వానికి అమెరికా మద్దతుగా నిలుస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు.మృతుల కుటుంబాలకు అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది అమానవీయ ఘటన అని పేర్కొన్నారు. ఈఏడాది ఏప్రిల్30న కాబూల్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 25 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది మీడియా ప్రతినిధులు ఉన్నారు. గతనెలలో దస్త్‌ఏ బార్చీ ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 34 మంది మృతి చెందారు. ఈరెండు దాడులకు బాధ్యత వహించినట్టు ఐఎస్ ప్రకటించుకుంది.