Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100 మంది మృతి
ట్రిపోలి : లిబియా తీరంలో రెండు పడవలు మునిగాయి. ఈ ఘటనలో 100 మంది మృతి చెందారు. మృతుల్లో 20 మంది చిన్నారులు ఉన్నారు. మరికొందరు గల్లంతయ్యారు. ఇంజిన్‌లో తలెత్తిన లోపం కారణంగా ఓ పడవ మునిగిపోయిందని అధికారులు అనుమానిస్తున్నారు.
సరిహద్దు సహాయక బృందాలు తెలిపిన వివరాల ప్రకారం...ఈనెల1న లిబియా నుంచి రెండు పడవలు బయలుదేరాయి. మధ్యధరా సముద్రంలో బయలుదేరిన ఈ రెండు పడవల్లో సూడాన్, మాలి, నైజీరియా, కామెరూన్, ఘనా,లిబియా, అల్జీరియా, ఈజిప్టు దేశాలకు చెందిన పౌరులు ప్రయాణించారు. ఇంజిన్‌లో తలెత్తిన సమస్య కారణంగా లిబియా తీరంలో ఓ పడవ మునిగిపోయింది. ఆ పడవలో ప్రయాణిస్తూ నీటమునిగినవారిని రక్షించేందుకు మరో పడవలోని ప్రయాణీకులు ప్రయత్నించారు. అయితే, సహాయక చర్యల్లో పాల్గొన్న సహచర ప్రయాణీకుల్లో కొంతమంది నీట మునిగినట్టు సమాచారం. రెండు పడవల్లో మొత్తం 185 మంది ప్రయాణించినట్టు సరిహద్దు సహాయక బృందాలు తెలిపాయి. వీరిలో కొంతమంది ఆచూకీ తెలి యాల్సి ఉంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, లిబియా తీరంలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిమితికి మించి పడవల్లో ప్రయాణం చేయడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది జరిగిన పడవ ప్రమాదాల్లో 3వేల మంది మృతి చెందారు.