Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సన్నద్ధమ వుతోంది. నాసా ఏరోనాటిక్స్ తొలిసారిగా అత్యాధునిక ప్రమా ణాలతో తయారు చేస్తున్న 'ఎక్స్-57' విద్యుత్ విమానాన్ని త్వరలో గాల్లోకి పంపేందుకు చకచకా పనులు పూర్తి చేస్తోంది. ఇటీవల ఏరోనాటిక్స్ ప్రయోగశాలలో దీనిని ప్రదర్శించింది. ఈ మేరకు ఆ సంస్థ ట్విట్టర్‌లో పలు వివరాలు వెల్లడించింది. 14 విద్యుత్ మోటార్లతో నడిచే ఈ విమానానికి ఎక్స్-57 'మాక్స్‌వెల్'గా పేరు పెట్టింది. ఈ విమాన తయారీ 2015లో ప్రారంభం కాగా, ఇటలీకి చెందిన టెక్నాం పీ2006టీ విమానాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారు. ఎడ్వర్డ్ వైమానిక దళ బేస్ నుంచి ఇది ఆకాశంలోకి దూసుకెళ్లేందుకు ఇంకా సంవత్సరం వేచి ఉండాలని సంస్థ తెలియజేసింది. గత రెండు దశాబ్దాల కాలంలో నాసా తయారు చేసిన సిబ్బంది విమానాల్లో మాక్స్‌వెల్ మొదటిది కావడం విశేషం. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ బ్రెంట్ కోబ్‌లీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. 'ఇప్పటికే పలు ప్రైవేటు కంపెనీలు విద్యుత్ విమానాల్ని తయారు చేయడం ప్రారంభించాయి. కానీ నాసా ప్రభుత్వం ధృవీకరించిన వాణిజ్య ప్రమాణాలతో తయారు చేస్తోంది.
ఇందులో గాలిని సమన్వయం చేసుకునే ప్రత్యేకతతో పాటు, భద్రత, శబ్దం, ఇంధన సామర్థ్యాలకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు పాటించాం. దీన్ని కేవలం మా ఒక్క సంస్థనే కాకుండా మొత్తం విమాన పరిశ్రమలకు ఉపయోగపడేలా దృష్టి పెట్టి రూపొందిస్తున్నాం. 2020 కల్లా మాక్స్‌వెల్‌ను గాల్లోకి పంపడమే మా లక్ష్యం' అని అన్నారు. అదేవిధంగా విమానానికి సంబంధించిన వివరాలు పేర్కొంటూ.. 'ఇందులో 14 విద్యుత్ ఇంజిన్లు ఉంటాయి. విమానం టేకాఫ్, ల్యాండింగ్ ప్రక్రియ సరిగా జరిగేందుకు వింగ్‌కు ఆరు చొప్పున లిఫ్టు ప్రొపెల్లర్స్ ఉంటాయి. ఈ విమానం ఇతర విమానాలతో పోలిస్తే నిర్వహణ సులువుగా ఉంటుంది, బరువు కూడా తక్కువగా ఉండటం వల్ల సులువుగా ఎగిరే అవకాశం ఉంటుంది. దీని నిర్మాణంలో బ్యాటరీ సామర్థ్యం పెంచడమే ప్రధాన సవాలు' అని అన్నారు.