Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణ సదస్సు హెచ్చరిక
మాడ్రిడ్: ప్రస్తుత శతాబ్దిలో 2100 సంవత్సరం నాటికి వాతావరణంలో ప్రాణవాయువు 3 నుంచి 4 శాతం మేర తగ్గే ప్రమాదం పొంచి వుందని ఇక్కడ జరుగుతున్న వాతావరణ సదస్సు హెచ్చరించింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సమర్పించిన నివేదికపై సదస్సు చర్చించింది. 1960-2010 మధ్యకాలంలో ప్రాణవాయువు స్థాయి 2 శాతం మేర పడిపోయిందనీ, ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ ఇదే స్థాయిలో కొనసాగితే 2100 నాటికి ఇది మరో మూడు నుంచి నాలుగు శాతం మేర తగ్గే అవకాశం వుందని ఈ నివేదిక వెల్లడించింది. 'సముద్ర నిరాక్సీకరణ-ప్రతి ఒక్కరి సమస్య' అన్న అంశంతో నిర్వహించిన ఈ అధ్యయనం వాతావరణంలో కొనసాగుతున్న గ్లోబల్ వార్మింగ్, సముద్ర జలాల్లో కార్బన్ డయాక్సైడ్ పెరుగుదలతో ఏర్పడుతున్న ఆమ్లీకరణ ప్రభావాలతో ప్రాణవాయువు స్థాయి క్రమంగా పడిపోతోందని ఈ నివేదికలో హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 900కు పైగా తీర ప్రాంతాలు, సముద్ర సమీప ప్రాంతాలు ఈ ప్రభావానికి లోనయ్యే అవకాశం వుందని తెలిపింది. ఇప్పటికే దాదాపు 700కు పైగా ప్రాంతాలలో ఆక్సిజన్ లభ్యత కనిష్ట స్థాయికి పడిపోయిందనీ, రానున్న కాలంలో ఇది మరో నాలుగింతలు పెరిగే అవకాశాలున్నాయని ఈ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది.