Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి ఆరోపణల కేసుల్లో అల్జీరియా కోర్టు సంచలన తీర్పు
- దేశ వ్యాప్తంగా ప్రజల సంబురాలు
- రేపు జరగనున్న అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : ఎన్నికల సంఘం
అల్జీర్స్ : ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణల కేసుల్లో దోషులుగా తేలిన ఇద్దరు మాజీ ప్రధానులకు అల్జీరియా ప్రత్యేక న్యాయస్థానం జైలుశిక్ష, జరిమానా విధించింది. గురువారం అల్జీరియా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో కోర్టు తీర్పు వెలువడటంతో మాజీ ప్రధానుల మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అవినీతికి పాల్పడిన నేతలకు శిక్ష పడటంతో దేశ ప్రజలంతా సంబురాలు జరుపుకుంటున్నారు. అల్జీరియా చీఫ్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం...పలు కార్ల కంపెనీల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పెట్టుబడుల రూపంలో పెట్టి లాభాలు ఆర్జించినట్టు మాజీ ప్రధానులు అహ్మద్ ఔయాహియా, అబ్దెల్‌మాలెక్ సెల్లాల్‌లపై మోపిన నేరారోపణలు రుజువయ్యాయి.
ఈ కేసులో అహ్మద్ ఔయాహియాకు 15ఏండ్ల కారాగారం, 16,000 డాలర్ల ( రూ.11,33,528) జరిమానా, అబ్దెల్‌మాలెక్‌కు 12ఏండ్ల కారాగారం, 8,000 డాలర్ల ( రూ.5,66,764 ) జరిమానా విధించినట్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఇదే కేసులో దోషులుగా తేలిన మాజీ పారిశ్రామిక శాఖ మంత్రి అబ్దెసలామ్ బౌచౌరెబ్‌కు 20ఏండ్ల జైలుశిక్ష విధించారు. ప్రస్తుతం ఆయన ప్రవాసంలో ఉన్నారు. ఆయన ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రముఖ వ్యాపారవేత్త అలీ హదాద్‌కు ఏడేండ్ల శిక్ష పడింది. ఈ కేసులో 19 మంది అభియోగాలు ఎదుర్కొన్నారు. వీరందరిలో మాజీ రవాణా శాఖ మంత్రి అబ్దెల్ ఘనీ జాలెన్ మాత్రమే నిర్దోషిగా బయటపడటం గమనార్హం. తాజా తీర్పుతో అల్జీరియాలో రాజకీయ పెను ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గురువారం అధ్యక్ష ఎన్నికలు జరుగను న్నాయి. అవినీతికి పాల్పడ్డ నేతలకు, మద్దతుదారులకు మంగళవారం కోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టుగా మారిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. స్టేట్ మీడియాలో ట్రయల్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ప్రజలు కోర్టు ఆవరణలో వీక్షించి సంబురాలు జరుపుకున్నారు. ఈఏడాది ఏప్రిల్‌లో అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్‌అజీజ్ బౌటెఫ్లికా గద్దె దిగారు. ప్రజాందోళనలు పెల్లుబికిన నేపథ్యంలో అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేశారు. అవినీతికి పాల్పడిన మంత్రులను కూడా గద్దె దించేంత వరకు తమ పోరాటం ఆగదంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరుకొని ఆందోళనలు చేపట్టారు. ఈ అల్లర్లలో అనేక మంది గాయపడ్డారు. 1962లో అల్జీరియాకు స్వాతంత్య్రం వచ్చింది. ఫ్రాన్స్ నుంచి విడిపోయి స్వతంత్య్ర రాజ్యంగా ఆవిర్భవించింది.
అయితే, అవినీతి ఆరోపణల కేసుల్లో దోషులుగా తేలిన ఇద్దరు మాజీ ప్రధానులు జైలుకెళ్లడం ఇదే ప్రథమం. అవినీతి నిర్మూలనపై అల్జీరియన్లు 40 వారాల పాటు అవిశ్రాంత పోరాటం చేసినందుకు ఫలితం దక్కిందని చీఫ్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయం వెల్లడించింది. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం నిరసనకారులు జాతీయ పతకాలతో దేశ వ్యాప్తంగా దర్శనమిచ్చారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. అవినీతిరహిత సమాజ నిర్మాణమే తమ ధ్యేయమంటూ నినాదాలు చేశారు. ' ఇకపై అవినీతికి పాల్పడాలంటే నేతల వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని' ఫ్రొఫెసర్ రాచిడ్ లెరాసి అన్నారు. అవినీతిరహిత పాలన అందించే అభ్యర్థులకు మాత్రమే ప్రజలు అధ్యక్ష ఎన్నికల్లో పట్టంకడతారని ఆమె అభిప్రాయపడ్డారు.