Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పది రోజులుగా తగ్గని పొడి దగ్గు, జ్వరం
- ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న వైద్యులు
లండన్ : కరోనా వైరస్ బారిన పడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు(55) వ్యాధి తీవ్రత పెరగడంతో వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత గురువారం(మార్చి 26) ఆయనకు కరోనా పాజిటివ్ తేలడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కానీ, వైరస్ లక్షణాలు ఇంకా కనిపిస్తుండటంతో ఆదివారం ఆయన్ను మధ్య లండన్‌లోని సేయింట్ థామస్ హాస్పిటల్‌లో చేర్చారు. బోరిస్ వ్యక్తిగత వైద్యుడి సూచనమేరకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కానీ, సోమవారం నాటికి వ్యాధి తీవ్రత పెరగడంతో వైద్యులు ఆయన్ను హుటాహుటిన ఐసీయూకి తరలించారు. గత పది రోజులుగా జ్వరం,పొడి దగ్గు తగ్గకపోవటం, శరీర ఉష్ణోగ్రత మరింత పెరగడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాని ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్‌లో చేరడంతో, బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ ప్రభుత్వ బాధ్యతలు అప్పజెప్పారు. స్వీయ నిర్బంధం తర్వాత ఏడు రోజులకు బయటకు రావొచ్చని వైద్యులు సూచించినప్పటికీ, ఆయనలో ఇంకా వైరస్ లక్షనాలున్నట్టు గుర్తించారు. దాంతో నిర్బంధాన్ని మరికొన్ని రోజులు పొడిగించుకున్నట్టు ఆయనే స్వయంగా వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. ''నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. నా ఏడు రోజుల నిర్బంధం కూడా పూర్తయింది. అయినా, నాలో ఇంకా స్వల్పంగా వైరస్ లక్షణాలున్నాయి. ఇంకా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత కాలం నేను స్వీయ నిర్బంధంలోనే ఉంటాను'' అని జాన్సన్ తెలిపారు. అయితే వ్యాధి తీవ్రత పెరుగుతున్నట్టు గుర్తించిన వైద్యులు ఆయన్ను ఐసీయూకి తరలించారు. ఇదిలా ఉండగా, బ్రిటన్‌లో కరోనా కేసుల సంఖ్య 51వేలు దాటింది. ఈ మహమ్మారి బారినపడి 5,373మంది మృతి చెందారు.