హైదరాబాద్ : బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కు పంజాబ్ లో ఊహించని పరిణామం ఎదురైంది. కర్తార్ పూర్ సాహిబ్ వద్ద ఆమె కారును రైతులు అడ్డుకున్నారు. గతంలో రైతు ఉద్యమం పట్ల ఆమె చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అయితే, ఆ నిరసనకారుల్లో ఉన్న కొందరు మహిళలతో కంగనా మాట్లాడిన తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. కంగనా కారు వెళ్లేందుకు రైతులు దారివిడిచారు. ఈ విషయాన్ని కంగనా సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించింది. తనను ఓ గుంపు చుట్టుముట్టిందని తెలిపింది. వారు తనను దూషించారని, చంపుతామని బెదిరించారని వివరించింది. ఆ సమయంలో తనతో పాటు భద్రతా సిబ్బంది లేకపోతే ఏంజరిగేది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేనేమైనా రాజకీయనేతనా? ఇలాంటి ఘటన జరగడం విస్మయం కలిగిస్తోంది. నమ్మలేకపోతున్నాను. ఇదేం ప్రవర్తన? అంటూ మండిపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి మద్దతుదారుగా గళం వినిపిస్తున్న కంగనా... వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మాట్లాడడం రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
Mon Jan 19, 2015 06:51 pm