హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేస్తున్నారన్న నెపంతో ముగ్గురిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలంలోని తారకరామనగర్‌లో తండ్రి నాగేశ్వరరావు, అతని కుమారులు రమేష్, రాంబాబులు మంత్రాలు చేస్తూ పలువురిని అనారోగ్యానికి గురి చేస్తున్నారని కొందరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఒక కుల సమావేశం జరిగినట్టు సమాచారం. ఈ సమావేశం ఎరుకల సంఘం భవనంలో జరుగుతుండగా తండ్రి, ఇద్దరు కొడుకులను దారుణంగా నరికి చంపేశారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడని తెలిసింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను జగిత్యాల ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm