హైదరాబాద్ : పెండ్లి కావడం లేదనిమద్యానికి బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబరు 7 లో నివసించే ప్రవీణ్ (30) జిరాక్స్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతను రెండేండ్లుగా పెండ్లి సంబంధాలు చూస్తున్నా.. అతని ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండడంతో సంబంధాలు కుదరడం లేదు. దాంతో మానసికంగా కుంగిపోయిన ప్రవీణ్ మద్యానికి బానిసయ్యాడు. అతని తల్లి ఆదివారం పనిమీద బీహెచ్‌ఈఎల్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లోని పడకగదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి తిరిగి వచ్చి చూసి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ప్రవీణ్ సోదరుడు బాల్‌కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm