హైదరాబాద్: ప్రముఖ సింగర్ కౌసల్యకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని, లక్షణాలు కూడా తీవ్రంగానే ఉన్నాయని ఆమె వివరించింది. తనకు రెండు రోజుల నుంచే జ్వరం ఉందని, ప్రస్తుతం కనీసం బెడ్‌పై నుంచి కూడా లేవలేకపోతున్నానని తెలిపింది. దానికి తోడు ఇప్పుడు తనను గొంతు నొప్పి కూడా చాలా ఇబ్బంది పెడుతోందని కౌసల్య చెప్పింది. కరోనాకు తాను నిన్నటి నుంచి మందులు వాడటం మొదలుపెట్టానని తెలిపింది. కరోనా విజృంభిస్తుండడంతో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె పేర్కొంది. సింగర్ కౌసల్య తెలుగులో అనేక హిట్ పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి విదితమే. మరోపక్క, ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకడంతో వారంతా ఐసోలేషన్‌లో ఉంటోన్న విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm