విశాఖపట్టణం: దేశపాత్రునిపాలెం పంచాయతీ శీరంశెట్టివానిపాలెం గ్రామంలోని ఒక ఇంట్లో నిల్వచేసి ఉంచినసుమారు రూ.10లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లను పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి గ్రామానికి చెందినఅంధవరపు నారాయణమూర్తి అనే వ్యక్తి శీరంశెట్టివానిపాలెంలో ఒక ఇంటిని తీసుకుని, అందులో ఖైనీ ప్యాకెట్లు నిల్వ ఉంచుకుని, వివిధ ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తుంటాడు. నారాయణమూర్తి స్వస్థలం చీపురుపల్లి అయినా విశాఖపట్టణంలోని సీతమ్మధారలో నివాసం ఉంటూ ఈ వ్యాపారం సాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఇక్కడ పెద్దఎత్తున ఖైనీ ప్యాకెట్లు ఉంచి వ్యాపారం సాగిస్తున్నట్టు పోలీసులకు సోమవారం సాయంత్రం సమాచారం వచ్చింది. దీంతో సీఐ ఎస్.బాలసూర్యారావు, ఎస్ఐ హేమంత్‌కుమార్ తమ సిబ్బందితో గ్రామానికి వెళ్లి ఖైనీ ప్యాకెట్లు నిల్వ ఉంచినఇంటిని సోదా చేశారు. ఖైనీప్యాకెట్లు గుట్టలుగుట్టలుగా ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. స్వాధీనం చేసుకున్న ప్యాకెట్ల విలువసుమారు రూ.10లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఈ మేరకు నిందితుడు నారాయణమూర్తిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm