హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ ఆలీ చాలా కాలం తర్వాత ఎఫ్ 3 సినిమాతో వెండి తెరపై కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన పాత్రలు రాకపోవడం వల్లనే సినిమాలను తగ్గించుకున్నానని తెలిపారు. చిన్న చిన్న సినిమాల్లో తనకు క్యారెక్టర్ ఇస్తున్నారని.. సినిమా కథ ఏంటో చెప్పరన్నారు. తీరా సినిమా చూస్తుంటే అలీగారు ఎందుకు ఈసినిమాలో నటించాడు? అని అందరు అనుకుంటారన్నారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు చేయడంలేదన్నారు. అయితే ఎఫ్ 3 సినిమాలో మాత్రం అనిల్ రావిపూడి తనతో పాలబేబీ అనే వడ్డీ వ్యాపారి పాత్రను చేయించారన్నారు. తెరపై తన పాత్ర చాలా సేపు ఉంటుందని నాన్ స్టాప్ గా నవ్విస్తుందని చెప్పారు. చాలా కాలం తరువాత ఒక మంచి పాత్రను చేసిన ఫీలింగ్ కలిగిందన్నారు. రాఘవేంద్రరావు గారు .. దాసరి గారు .. ఈవీవీ గారితో సినిమాలు చేశానని.. వాళ్లందరి లక్షణాలు తనకు అనిల్ రావిపూడిలో కనిపించాయని చెప్పారు. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ టెన్షన్ లేకుండా తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్లే ఆయన తీరు నాకు నచ్చిందన్నారు. తక్కువ వయసులో ఇంతమంది ఆర్టిస్టులను మేంటేన్ చేయడం అనేది గొప్ప విషయమన్నారు. ఎఫ్ 3 ఫైసా వసూల్ మూవీ అని.. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే మూడు వందల రూపాయల ఆనందం వస్తుందన్నారు. ఈ నెల 27న ఎఫ్ 3 సినిమా విడుదలవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm