హైదరాబాద్ : రాజశేఖర్ హీరోగా నటించిన 'శేఖర్' సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ఈవెంట్ లో జీవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జీవితపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్ సందర్భంగా శివానీ, శివాత్మిక ఇద్దర్లో ఎక్కువ ఎవరు ఖర్చు పెడతారని యాంకర్ ప్రశ్నించగా.. ఇద్దరూ ఫుడ్ మీద ఎక్కువగా ఖర్చు చేస్తుంటారని జీవిత చెప్పారు. శివానీ పేరు స్విగ్గీ వాళ్లకు బాగా తెలుసని.. కొంచెం లేట్ అయినా ఆమె ఒప్పుకోదని.. దానిది కోమటిదాని లెక్కని.. డబ్బులు ఇచ్చేంత వరకు వాళ్లను వదిలిపెట్టదని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా మాట్లాడిందని, తమ కులానికి పిసినారితనాన్ని అపాదించేలా కామెంట్ చేసిందని ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై జీవిత స్పందిస్తూ... తనకు ఆర్యవైశ్యులంటే చాలా గౌరవం ఉందని చెప్పారు. వారిని కించపరచాలని తాను మాట్లాడలేదని... కోమటివాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారని, డబ్బుకు విలువనిస్తారని, చాలా పద్ధతిగా ఖర్చు చేస్తారని, సంపాదనలో కొంత మొత్తాన్ని దానధర్మాలు చేస్తారని, దేవుడి హుండీల్లో వేస్తారని అన్నారు. డబ్బులు జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి.. 'కోమటోళ్ల లెక్క' అనే నానుడిని ఎప్పటి నుంచో వాడుతున్నారని... తాను కూడా ఆ ఉద్దేశంతోనే మాట్లాడానని, ఆర్యవైశ్యులను కించపరిచేందుకు కాదని చెప్పారు. ఆర్యవైశ్యుల గొప్ప క్వాలిటీని చెపుతూనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. శివానీ ఒక్క పైసాను కూడా వదులుకోదని... కోమటోళ్ల మాదిరి జాగ్రత్తగా ఉంటుందనే ఉద్దేశంతోనే మాట్లాడానని చెప్పారు. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుకుంటున్నానని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm