తిరువనంతపురం : కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ర్ట అవతరణ దినోత్సవమైన నవంబర్ 1న సొంత ఓటీటీని ప్రారంభించనుంది. దాంతో భారత్‌లో తొలిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఓటీటీ నిర్వహించనున్న ఘనతను సొంతం చేసుకుంటుంది. సీ స్పేస్ పేరిట రూపొందిస్తున్న ఈ ఓటీటీలో పలు చిత్రాలు, జాతీయంగా, అంతర్జాతీయంగా అవార్డులు గెలిచిన సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లు ఉంటాయని, ప్రస్తుతమున్న ఓటీటీలకు భిన్నంగా ఈ ఓటీటీలో కొన్ని ఫీచర్లను పొందుపరచనున్నట్లు ఆ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి సాజీ చెరియన్ వెల్లడించారు. ఈ ఓటీటీని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెఎస్‌ఎఫ్‌డిసి) చొరవతో ప్రభుత్వం నిర్వహించనుందని తెలిపారు. కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చొరవతో కూడిన ఈ ప్లాట్‌ఫాం మలయాళ సినిమా వృద్ధికి సాయపడుతుందని ఆయన అన్నారు. కొత్త ఓటీటీ ద్వారా సినిమా వ్యాపారానికి ఎలాంటి సంక్షోభం తలెత్తదని భరోసా ఇచ్చారు. సినిమాలను థియేటర్లలో విడుదల చేసిన తర్వాతే.. సీ స్పేస్‌లో ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. సీ స్పేస్ లాభాల భాగస్వామ్యంతోపాటు, అత్యాధునిక సాంకేతిక నాణ్యతను నిర్ధారిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే సీ స్పేస్‌లో ప్రసారం చేయబోయే సినిమాల రిజిస్ట్రేషన్ జూన్ 1న ప్రారంభం కానుందని.. దీనికోసం చిత్రాంజలి స్టూడియోతోపాటు, రాష్ట్ర రాజధానిలోని కెఎస్‌ఎఫ్‌డిసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని థియేటర్ల పునరుద్ధరణకు తగినన్ని నిధులు కేటాయిస్తామని, చిత్రాంజలి స్టూడియోను షూటింగ్ లొకేషన్‌గా మార్చేందుకు ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm