హైదరాబాద్ : ఓ భూత వైద్యుడి నిర్వాకం వల్ల ఇంటర్ చదువుతున్న బాలిక తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన మంజుల వెంకటయ్య 17 ఏండ్ల కుమార్తె అశ్విని వికారాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురైంది. అయితే పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన వారి సమీప బంధువు.. తమ గ్రామంలోని దర్గా సమీపంలో ఓ బాబా (భూత వైద్యుడు) రఫీ ఉన్నాడని, ప్రతి శుక్రవారం భూత వైద్యం చేస్తాడని అశ్విని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో గత శుక్రవారం బాలికను అతడి వద్దకు తీసుకెళ్లారు. ఆ దొంగ బాబా.. బాలికకు దెయ్యం పట్టిందని నమ్మించాడు. దెయ్యం వదిలిస్తానంటూ బాలికను చిత్రహింసలు పెట్టాడు. చేతులను నిప్పులపై పెట్టించాడు. ఈ క్రమంలో బాలిక రెండు కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తమ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ పట్లోళ్ల రాములుకు ఈ విషయం తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన.. బాలికను వికారాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగోలేదని.. పాదాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్.. బాధిత బాలికను పరామర్శించారు. సదరు భూత వైద్యుడిని అరెస్టు చేయాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.ఈ మేరకు బుధవారం రాత్రి నకిలీ బాబా రఫీని అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm