హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మృతి అంశం ఏపీలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అనంత ఉదయ్ బాబు మాట్లాడుతూ, సుబ్రహ్మణ్యం గత ఐదేళ్లుగా తన వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడని చెప్పారు. రెండు నెలల నుంచి సరిగా పనికి రావడం లేదని తెలిపారు. సుబ్రహ్మణ్యంకు మద్యం అలవాటు ఉందని, దీంతో ద్విచక్ర వాహనంపై అనేకసార్లు ప్రమాదానికి గురయ్యాడని చెప్పారు. నిన్న రాత్రి కూడా సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్ కు గురైనట్టు తెలిసిందని... దీంతో అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చానని తెలిపారు. చికిత్స కోసం అతడిని కాకినాడలోని అమృత ఆసుపత్రికి తీసుకెళ్లామని... ఆసుపత్రి వద్దకు అతని తల్లిదండ్రులు కూడా వచ్చారని చెప్పారు. ఆసుపత్రిలో సుబ్రహ్మణ్యం చనిపోవడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్తామని చెప్పారని... దీంతో, భౌతికకాయాన్ని కారులో అపార్ట్ మెంట్ వద్దకు పంపించామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm