హైదరాబాద్ : ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలపై నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. మే 28న ప్రారంభమయ్యే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 365 రోజులు జరుగుతాయని స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. శక పురుషుని శత జయంతి ఉత్సవాలు పేరిట ఎన్టీఆర్ శత జయంతిని కుటుంబసభ్యులంతా నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ సినీరంగంలో అడుగు పెడితే భారతీయ సినిమా తెలుగు సినిమాని తలెత్తి చూసిందని అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, తెలుగు సంస్కృతి తలెత్తి నిలబడిందని చెప్పారు. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుందని.. ఆ రోజు నుంచి 2023 మే 28 వరకు, 365 రోజుల పాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచెరగులా జరుగుతాయన్నారు. తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ఈ వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ఉత్సవాల్లో వారానికి 5 సినిమాలు, రెండు సదస్సులు ఉంటాయన్నారు. నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాలు ప్రదానోత్సవం చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm