హైదరాబాద్ : ప్రేమించానని నమ్మించి, చివరికి మా అమ్మ ఒప్పుకోవటం లేదని ప్రియుడు మొఖం చాటేయటంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన గుంటూరు జిల్లాలోని పలకలూరు రోడ్డులోని ఓ కళాశాలలో చోటుచేసుకుంది. చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలేనికి చెందిన ఓ యువతి పట్టాభిపురంలోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె అదే గ్రామానికి చెందిన మంచాల పవన్‌కుమార్‌ను మూడేళ్లుగా ప్రేమించింది. డిగ్రీ అయిన తర్వాత పెళ్లి చేసుకంటానని నమ్మించిన పవన్‌కుమార్ ఈనెల 23న మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ విషయం తెలిసి నిలదీయటంతో మా అమ్మ ఒప్పుకోవటం లేదని చెప్పాడు. అయినా బలవంతం చేయటంతో శనివారం తాను కళాశాల వద్దకు వస్తానని ఇద్దరం కలిసి వెళ్లి పెళ్లి చేసుకుందాం అని నమ్మించాడు. దీని ప్రకారం 11 గంటలకు పరీక్ష పూర్తయిన తర్వాత ప్రియుడి కోసం గంటసేపు వేచి ఉంది. ఫోను కూడా ఎత్తకపోవటంతో మోసపోయానని గ్రహించి అదే కళాశాల భవనం రెండో అంతస్థుపైకి వెళ్లి దూకింది. వెంటనే సిబ్బంది జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు వెన్నెముకకు, అరికాళ్లకు దెబ్బలు తగిలినట్టు గుర్తించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm