హైదరాబాద్ : కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను పంజాబ్ లోని చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో సీఎం కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా 600 కుటుంబాలకు 3 లక్షల చొప్పున వారు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు కుటుంబాలు తాము ఒంటరయ్యామని ఆందోళన చెందవద్దని, తామంతా అండగా ఉన్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా రైతులు చేసే ఉద్యమానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, వాటికి మద్దతిస్తామని తెలిపారు. రైతులకు ఫ్రెండ్లీగా ఉన్న ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అస్సలు గిట్టదని చెప్పారు. ఏదో విధంగా వారిని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుందని విమర్శించారు. రైతులందరూ ఏకం కావాలని.. ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉందని అన్నారు.
ఇంకా వారు మాట్లాడుతూ.. 'స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడచినా.. ఇంకా ఇలాంటి సమావేశాలు నిర్వహించడం అత్యంత బాధాకరం. సమస్యల్లేని దేశం ఉందని నేను అనను. సమస్యలున్న దేశాలున్నాయి. కానీ ఇలాంటి సమస్యలున్న దేశాలు మాత్రం లేవు. రైతు సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకడం లేదు. కేంద్రంపై ఒత్తిడి పెంచి, రైతులు తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేసుకున్నారని, వారందరికీ శతకోటి ప్రణామాలు. అయితే రైతు ఉద్యమంలో అసువులు బాసిన వారిని తిరిగి తీసుకురాలేం. రైతు కుటుంబాలు ఒంటరిగా లేవు. దేశంమొత్తం మీకు అండగా వుంది.
షహీద్ భగత్ సింగ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని కన్న రాఫ్ట్రం పంజాబ్. దేశానికి పంజాబ్ రాష్ట్రం గొప్ప సేవలు చేసింది. దేశవ్యాప్తంగా అన్నపానాదులకు కష్టంగా ఉన్న సమయంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో పంజాబ్ రైతులు దేశానికి అన్నం పెట్టారు. ఇంత గొప్ప సేవలు చేసిన పంజాబ్ రైతులను మరిచిపోరు. చైనా సైనికులతో దేశం కోసం కొట్లాడి, అమరులైన కల్నల్ సంతోశ్‌బాబు మా తెలంగాణ ప్రాంతం వారు. ఆయనతో పాటు పంజాబ్ సైనికులు కూడా వీరమరణం పొందారు. వీర మరణం పొందిన వారి కుటుంబాలను పరామర్శించాలని నేను అనుకున్నా. కానీ.. ఆ సమయంలో ఎన్నికలు జరిగాయి. అందుకే రాలేకపోయా. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కూడా పంచుకున్నా. ఆయన సంతోషం వ్యక్తం చేసి, నా కార్యక్రమానికి మద్దతిచ్చారు.
దేశంలోని రైతులందరూ ఉద్యమంలోకి రావాలి. ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉంది. కనీస మద్దతు ధర విషయంలో ఏ ప్రభుత్వమైతే చట్టబద్ధత కల్పిస్తుందో వారికే మద్దతివ్వాలి. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నా. రైతు కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు` అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 May,2022 06:18PM