హైదరాబాద్ : ఒడిశాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గంజామ్-కందమాల్ సరిహద్దుల్లోని కళింగ ఘాట్ వద్ద టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 42 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. బ్రేక్ ఫెయిలవడంతో టూరిస్టు బస్సు బోల్తా పడిందని చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నదని వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 77 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm