హైదరాబాద్ : మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు గత కొద్ది రోజులుగా దొంగతనంగా ఇసుక రవాణా చేస్తున్నాడు. అయితే బుధవారం గ్రామ శివారులోని దుబ్బలమాకు వద్ద ఇసుకను ట్రాక్టర్‌లో నింపేందుకు కూలీలు అశోక్(27), మహేశ్(21)ను అతను తీసుకెళ్లాడు. ఇసుక తీస్తున్న క్రమంలో ఇసుక దిబ్బలు కూలి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్తులు అక్కడికి చేరుకొని జెసిబి సాయంతో కూలీల మృతదేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న శివ్వంపేట ఎస్ఐ రవికాంత్ రావు తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు అశోక్‌కు భార్య, మూడేండ్ల కుమారుడు ఉన్నారు. మహేష్‌కు ఇంకా పెండ్లి కాలేదు. బాధిత కుటుంబాలకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm