హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ... తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. కాళేశ్వరంలో అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రధానిని రేవంత్ ప్రశ్నించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు హామీని నెరవేర్చుతారా? లేదా? అని నిలదీశారు. విభజన హామీల్లో భాగంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ప్రశ్నించారు. నైనీ కోల్ మైన్స్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా చర్యలెందుకు తీసుకోవడం లేదన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యం ఎందుకు అని నిలదీశారు. రామాయణం సర్క్యూట్ ప్రాజెక్ట్‌లో భద్రాద్రి రాముడికి చోటెందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm