హైదరాబాద్ : బండి సంజయ్ లాంటి వ్యక్తుల మాటల వల్ల తెలంగాణకు కంపెనీలు రావని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మసీదులు తవ్వేందుకు సిద్ధమేనా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. గురువారం కరీంనగర్ లోని బీరప్ప కురుమ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుందని.. అయితే బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల మూలంగా శాంతియుతంగా ఉన్న తెలంగాణలో అశాంతి నెలకొనే అవకాశం ఉందన్నారు మసీదులు, దేవాలయాలు కూల్చాలని అనడం సరికాదన్నారు. ఏ మతం వాళ్ళు కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఒప్పుకోరన్నారు. అల్లర్ల వల్లే గుజరాత్‌కు కంపెనీలు రావడం లేదని.. సంజయ్ లాంటి వ్యక్తుల మాటల వల్ల తెలంగాణకు కంపెనీలు రావని చెప్పారు. బేషరతుగా సంజయ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడులు, మసీదులు ధ్వంసం చేసేందుకు కాకుండా అభివృద్ధి కార్యక్రమాల కోసం తవ్వకాలు చేపట్టాలని హితవు పలికారు.
Mon Jan 19, 2015 06:51 pm