హైదరాబాద్ : తెలంగాణలో వరుసగా బాలికలపై లైంగికదాడి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లో తనపై ఇంట్లో అద్దెకుండే ఓ యువకుడు లైంగికదాడి చేశాడని ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళ్తే.. మోండా మార్కెట్ పరిధిలో ఎల్లేశ్ అనే యువకుడు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అదే ఇంట్లో భార్యాభర్తలు, పదో తరగతి చదువుతున్న వారి కుమార్తె ఉంటున్నారు. అయితే ఎల్లేశ్ ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 1న ఇంట్లో నుంచి ఆ బాలిక అదృశ్యమైంది. ఆ తర్వాత ఎల్లేశ్ కూడా కనిపించకుండా పోయాడు. అనుమానమొచ్చిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా అదృశ్యమైన బాలిక బుధవారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనపై ఎల్లేశ్ లైంగికదాడి చేశాడని ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm