#WATCH | Telangana: Secunderabad railway station vandalised and a train set ablaze by agitators who are protesting against #AgnipathRecruitmentScheme. pic.twitter.com/2llzyfT4XG
— ANI (@ANI) June 17, 2022
హైదరాబాద్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆందోళనలో మృతిచెందిన వ్యక్తి వరంగల్ జిల్లాకు చెందిన దామోదర్ రాకేశ్‌గా గుర్తించారు. ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌లో పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దాంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మొత్తం 15 రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలిసింది. అలాగే పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
అగ్నిపథ్ ను రద్దుచేసి మిలటరీ రిక్రూట్‌మెంటును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌లో యువకులు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బస్సులపై రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు.. రైల్వే స్టేషన్ వద్దనున్న బస్టాండుకు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లారు. అక్కడ ఆగిఉన్న రైళ్లపై రాళ్లు రువ్వారు. రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిరసనకు దిగారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రయాణికులు భయంతో స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలైనట్టు తెలిసింది. ఈ ఘటనతో అధికారులు రైళ్లన్నింటినీ నిలిపివేశారు.
ఆందోళనకారుల దాడిలో మూడు రైళ్లు ధ్వంసం అయినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పార్శిల్ రైలుతో పాటు అజంతా ఎక్స్‌ప్రెస్‌లో 2 బోగిలు దగ్ధం అయ్యాయని, 40 బైక్‌లు కూడా ధ్వంసం చేశారని రైల్వే సీపీఆర్వో రాకేష్ పేర్కొన్నారు. 44 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లు రద్దుచేసినట్లు తెలిపారు.