ముంబై : మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం భావోద్వేగానికి గురైనట్టు తెలిసింది. ముంబైలోని సెక్రటేరియట్‌లో నేడు క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన వాళ్లే తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించాలని తన క్యాబినెట్ మంత్రులతో అన్నారు. అంతేకాకుండా తనకు ఇన్ని రోజులుగా మద్దతుగా నిలబడినందుకు ఆయన మంత్రులకు కృతజ్ఞతలు చెప్పారు. మూడు పార్టీలు(శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్) కలిసి రెండున్నరేండ్లు మంచి పనిచేశాయని.. అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. గురువారం బలపరీక్ష జరిగితే ఇది ఇక్కడితో అంతమైపోతుందో లేక కొనసాగుతుందో తేలిపోతుందన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ తనకు మద్దతుగా నిలిచాయని... కానీ దురదృష్టవశాత్తూ తన సొంత పార్టీ వాళ్లు అండగా లేరన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm