గుంటూరు: తల్లికి క్యాన్సర్ అని తెలిసి ఆవేదనతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో ఒక నూలు మిల్లులో జరిగింది. చిలకలూరిపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం గీతనపల్లి గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ(34) అనే యువకుడు బొప్పూడిలోని ఒక నూలుమిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనితో పాటు భార్య, కుమార్తెలు కూడా క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. అతని తల్లికి క్యాన్సర్ అని తెలియడంతో ఆమెను శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడకు తీసుకు వచ్చి పరీక్షలు చేయించి మందులు సమకూర్చాడు. ఆ దిగులుతో కుటుంబ సభ్యులందరినీ గీతనపల్లి గ్రామంలో వదిలి పెట్టి తిరిగివచ్చాడు. మూడు రోజులుగా అతను కన్పించక పోవటంతో చుట్టు పక్కల వారు అతని క్వార్టర్స్ వద్దకు వచ్చి కిటికిలో నుంచి చూడగా ఉరి వేసుకొని కన్పించాడు. చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm