బెంగళూరు: విజయపురలో జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కుమారస్వామేనని, ఆయనను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని సంచలనంగా వ్యాఖ్యానించారు. కుమారస్వామి సీఎం కాకపోతే తాను రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ప్రథమ స్థానంలో ఉంటుందని, తమ పార్టీ జరిపిన సర్వేలో తేలిందన్నారు. పాత మైసూరుతోపాటు ఉత్తర కర్ణాటకలోనూ తాము ఎక్కువ స్థానాలు గెలుస్తామని తెలిపారు. పార్టీ నిర్వహిస్తున్న పంచరత్న యాత్రకు ప్రజలనుంచి భారీగా స్పందన లభిస్తోందన్నారు. వచ్చే నెలలో ఉత్తర కర్ణాటకలోనూ యాత్ర కొనసాగనుందని, ఈ నెల 18 నుంచి విజయపుర, బాగల్కోటె జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో సభలు జరుపుతామని చెప్పారు. ప్రస్తుతానికి 80 మంది అభ్యర్థుల జాబితా ఖరారైందన్నారు. ప్రజలకు ఉచిత వైద్యం, గుణాత్మక విద్య, మహిళా సాధికారత, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా జేడీఎస్ ప్రచారం చేస్తున్నదని తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm