హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ప్రగతి భవన్ కు వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ తరుణంలో షర్మిల తల్లి విజయమ్మ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు గృహనిర్బంధం చేశారు. దాంతో విజయమ్మ లోటస్ పాండ్ నివాసం వద్దే దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, షర్మిల వచ్చేంతవరకు తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు. షర్మిల ఏం నేరం చేసిందని ప్రశ్నించారు. పాదయాత్ర చేయడం రాజ్యాంగానికి విరుద్ధమా ప్రభుత్వాన్ని విమర్శించిందని దాడులు చేస్తారా? అంటూ మండిపడ్డారు. షర్మిల ఎక్కడి బిడ్డ అనేది ముఖ్యం కాదని, షర్మిల పుట్టింది, పెరిగింది తెలంగాణలోనే అని విజయమ్మ స్పష్టం చేశారు. మనవాళ్లు పరాయి దేశాల్లో ప్రధానులు అవుతున్నారని, ఇంకా షర్మిలది రాయలసీమ అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm