కాబూల్: ఆప్ఘనిస్థాన్ సిటీ ఏబక్ లోని జహదియా సెమినరీ వద్ద బుధవారం మధ్యాహ్నం అత్యంత శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సుమారు 15 మంది దుర్మరణం పాలయ్యారు. 27 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు జరిగినట్టు ఆప్ఘనిస్థాన్ టోలో వార్తా సంస్థ తెలిపింది. ఏబక్‌లోని రెలిజియస్ స్కూల్‌ను బాంబు తాకినట్టు హోం శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫి టకోర్ తెలిపారు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంతవరకూ ఏ సంస్థా ప్రకటించలేదు. 2021 ఆగస్టులో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐస్లామిక్ స్టేట్ గ్రూప్ హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. ప్రధానంగా షియా ముస్లిం మైనారిటీలను టార్గెట్‌గా చేసుకోవడంతో పాటు గతంలో తాలిబన్లతో సంబంధం ఉన్న సున్నీ మసీదులు, మదరసాలపై బాంబు దాడులు జరుపుతోంది. తాలిబన్లు, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కరడుగట్టిన సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ, బద్ధశత్రువులుగా ఉన్నారు.