హైదరాబాద్: టీమ్ఇండియా మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ ఓ వివాదంలో చిక్కుకొంది. ఓ సూపర్ మార్కెట్లో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతోపాటు ఆమెకు సంబంధించిన వ్యక్తులు దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. అయితే సమస్య సామరస్యంగా పరిష్కారమైనట్లు తెలుస్తోంది. ఇది కర్ణాటకలోని విజయపుర ప్రాంతంలో చోటు చేసుకుంది. కాస్మొటిక్స్ వస్తువుల కోసం రాజేశ్వరి గైక్వాడ్ ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బందికి, క్రికెటర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటికే క్రికెటర్‌కు చెందిన కొంతమంది మార్కెట్ సిబ్బందిపై దాడి చేసేందుకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సీసీ ఫుటేజీని సూపర్ మార్కెట్ సిబ్బంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇరు వర్గాలు కేసు పెట్టేందుకు సమాయత్తమైనప్పటికీ.. సూపర్ మార్కెట్ సిబ్బంది, రాజేశ్వరి గైక్వాడ్ సహాయకులు రాజీ పడి సమస్యను పరిష్కరించుకొన్నారు. అయితే దాడి విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించి కేసు నమోదు కాలేదని విజయపుర పోలీసులు స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm