నవతెలంగాణ-న్యూఢిల్లీ : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మహిళల మాతృత్వం అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఏ వయసులో తల్లి అయితే బాగుంటుందో వివరించారు. స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలని, లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. బిడ్డలను కనడం ఆలస్యం చేయరాదని, మహిళలు తల్లి అయ్యేందుకు 22 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు అత్యంత అనుకూలమైనదని వెల్లడించారు. యుక్త వయసు వచ్చినప్పటికీ, ఇంకా పెళ్లి చేసుకోని యువతులు ఎవరైనా ఉంటే వారు త్వరగా పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. గువాహటిలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన సీఎం హిమంత బిశ్వ శర్మ పైవ్యాఖ్యలు చేశారు. బాల్య వివాహాలు, చిన్నవయసులోనే గర్భం దాల్చడం వంటి సామాజిక సమస్యల నేపథ్యంలో, పోక్సో వంటి కఠిన చట్టాలు తీసుకురావాలని అసోం ప్రభుత్వం భావిస్తోంది. 14 ఏళ్ల లోపు ఉన్న బాలికలతో లైంగిక సంబంధం కలిగి ఉండడం నేరమని, ఈ నేపథ్యంలో వచ్చే ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలు అరెస్ట్ అవుతారని సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. బాలికను పెళ్లి చేసుకున్నప్పటికీ, ఆ భర్త జైలు పాలుకాక తప్పదని స్పష్టం చేశారు. చట్టప్రకారం స్త్రీల పెళ్లీడు వయసు 18 ఏళ్లని, చిన్న వయసున్న బాలికలను వివాహం చేసుకున్న పురుషులకు జీవితఖైదు పడే అకాశాలున్నాయని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm