హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నేటితో గడువు ముగియడంతో ఇప్పటివరకు మొత్తంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను అధికారులు వెల్లడించారు. 9,168 పోస్టులకు 8,47,277 మంది అప్లై చేసుకున్నట్టు తెలిపారు. నిన్న ఒక్కరోజే 58,845 మంది దరఖాస్తు చేసుకోగా.. ఆఖరి రోజైన సోమవారం కొత్తగా మరో 34,247 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వివరించారు. మరోవైపు, దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు భారీ స్పందన వస్తుండటంతో సర్వర్‌పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగి దరఖాస్తు ఫారం పూర్తి చేశాక ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోని 25 విభాగాల్లో 9,168 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm