నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ సమావేశ మందిరంలో శుక్రవారం ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. శాసనసభ సంయుక్త సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పరస్పరం పలకరించుకున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 11.55 గంటలకు అసెంబ్లీ సమావేశ మందిరంలోకి వచ్చారు. లోపలికి వస్తూనే మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను పేరుపేరునా పలకరిస్తూ ముందుకుసాగారు. ఈ తరుణంలోనే బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల దగ్గరికీ తనే స్వయంగా వెళ్లారు. తాను వెళ్లగానే మర్యాదపూర్వకంగా లేచి నిలబడి సభ్యులు కరచాలనం చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌తో చాలాసేపు ముచ్చటించారు. అలాగే భట్టివిక్రమార్కతో ముచ్చటిస్తూనే ఎమ్మెల్యే జగ్గారెడ్డివైపు చూసి అభివాదం చేశారు. దీంతో జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్ వద్దకు వచ్చి పలకరించారు. తరువాత ఎంఐఎం సభ్యుల దగ్గరికి వెళ్లి విష్ చేశారు. మొత్తంగా మంత్రి కేటీఆర్ సభలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించి, సభలో ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకొచ్చారు.