నవతెలంగాణ-హైదరాబాద్ : యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను పరిచయం చేస్తోంది. కేవలం మెసేజింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. గ్రూప్ కాలింగ్, పేమెంట్స్, ఫొటో ఎడిట్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఒకేసారి 100 మీడియా ఫైల్స్ ను షేర్ చేయొచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో 30కి మించి మీడియా ఫైల్స్‌ను షేర్ చేయలేం. తాజా అప్‌డేట్‌లో ఈ పరిమితిని 100కి పెంచుతున్నట్లు వాట్సాప్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అప్‌డేట్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ ఫీచర్ ఇప్పటికీ రాకుంటే యూజర్లు తమ ఫోన్లలో వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.4.3 వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలి. త్వరలో ఐఓఎస్ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ చాట్‌లో భాగంగా తరచూ ఫొటోలు షేర్ చేసేవారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇటీవలే వాట్సాప్ వీడియో మోడ్ ను పరిచయం చేసింది. దీంతో యూజర్లు వీడియో రికార్డింగ్ కోసం గతంలో మాదిరి కెమెరా బటన్‌ను నొక్కి పెట్టాల్సిన అవసరంలేదు. రికార్డింగ్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు ఒరిజినల్ క్వాలిటీలో ఫొటోలను షేర్ చేసుకునేలా వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్ అందుబాటులోకి రానుంది.
Mon Jan 19, 2015 06:51 pm