నవతెలంగాణ-హైదరాబాద్ : పంజాబ్ మెయిల్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్ మెయిల్.. పశ్చిమబెంగాల్‌లోని హౌరా నుంచి అమృత్‌సర్ వెళ్తున్నది. ఈ క్రమంలో బీహార్ దాటి ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. అయితే ఘాజీపూర్ జిల్లాలోని జమానియా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న గడాహిన్ గ్రామం వద్ద ట్రాక్‌లోని ఓ పట్టా విరిగిపోయింది. అటుగా వెళ్తున్న నసీమ్ అనే యువకుడు దానిని గుర్తించాడు. దీంతో వెంటనే కొద్ది దూరంలో ఉన్న గ్యాంగ్‌మెన్‌కు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకుని పరిశీలించిన ఆయన.. పట్టా విరిగిందని నిర్ధారించుకున్నాడు. అయితే పంజాబ్ అదే రూట్‌లో దూసుకొస్తున్నది. అప్పటికే వారున్న ప్రాంతానికి సమీపించింది. ఇద్దరూ కలిసి రైలుకు ఎర్రజెండా చూపించారు. కానీ రైలు స్పీడ్‌మీద ఉండటంతో ఆగకుండా వెళ్లింది. వారు జెండా ఊపుతూ కేకలు వేయడంతో రైలు వేగం క్రమంగా తగ్గింది. అప్పటికే రైలులోని కొన్ని బోగీలు పట్టా విరిగిన ప్రాంతాన్ని దాటేశాయి. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm