నవతెలంగాణ - ఢీల్లి
లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు చెప్పలేదన్నారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపిన తీర్మానంపై లోక్‌సభలో చర్చ అనంతరం ప్రధాని మోడి బుధవారం సాయంత్రం ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో కాంగ్రెస్ సహా పలు విపక్షాలను లక్ష్యంగా చేసుకొని మోదీ విమర్శలు గుప్పించారు.
లోక్‌సభలో మోడీ ప్రసంగం అనంతరం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ మోడీ ప్రసంగంలో తనకు సమాధానం కనిపించలేదన్నారు. అదానీ వ్యవహారంలో తాను సభలో అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పలేదని, అంతేకాకుండా అదానీ గ్రూప్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తామని కూడా అనలేదని మండిపడ్డారు. అదానీని ప్రధానినే రక్షిస్తున్నారని, ఈ అంశం జాతీయ భద్రతకు సంబంధించింది గనక ప్రధాని విచారణ జరిపించాల్సిందే’’ అని డిమాండ్ చేశారు.