Sun 26 Jul 11:21:23.858913 2020
కమ్మని కైతల రేడు
చక్కనైన చెలికాడు
పగలే వెన్నెల కురిసి
బతుకంతా గడిపాడు
పరుల కొరకు పాటుపడే
మెత్తని మనసున్నవాడు
నిరంతరం కవిత కొరకు
పరుగులు తీసినవాడు
విశ్వంభరుడై ఎదిగెను సినారె
విశ్వకవిగ విలసిల్లెను భళారె
ఆదిమ నాగరికతలో
నాదాలను స్ప్రుశియించి
కర్పూరపు వసంతాల
సోయగాలు చిలుకరించి
గోగుపూల లోని కొత్త
అందాలను పలుకరించి
నాగార్జునసాగర నవ
తరంగాల మధియించి
భూమికయై ప్రభవించెను సినారె -అమర
వేదికయై వెలుగొందెను భళారె
నవ్వని పువ్వుల లోన
రవ్వలనెన్నో రాల్చీ
దివ్వెల మువ్వల తోడ
సవ్వడులెన్నో చేసీ
మరణానికి పాలుపట్టి
జోల పాట పాడి
గున్న మామిడీ కొమ్మల
గూళ్ల తోడ ఆడి
వేదమ్మై నినదించెను సినారె-జ్ఞాన
పీఠమ్మై కనిపించెను భళారె
--తిరునగరి శ్రీనివాసస్వామి
సినీగేయ రచయిత
9440369939