- టెలీ కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సమీక్ష
నవతెలంగాణ కంటేశ్వర్
నవతెలంగాణ కంటేశ్వర్
నేటి నుండి పకడ్బందీగా ఇంటింటి ఆరోగ్యం సర్వే నిర్వహించాలని టెలీ కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కొవిడ్ అవుట్ పేషేంట్ విభాగం,వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఒమీక్రాన్ వేరియంట్ ప్రభావంతో కొవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న దృష్ట్యా యావత్తు అధికార యంత్రాగం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. గురువారం ఆయన తన ఛాంబర్ నుండి అన్ని మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మెడికల్ ఆఫీసర్లు, మునిసిపల్, పంచాయతీరాజ్, ఐసీడీఎస్, మెప్మా తదితర శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. కొవిడ్ కేసుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి దిశా నిర్దేశం చేశారు. ఆయా గ్రామాల వారీగా అధికారులు, సిబ్బంది అందరూ కొవిడ్ సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధమై వుండాలని, ప్రజల ఆరోగ్యాలు, వారి విలువైన ప్రాణాలను కాపాడాల్సిన గురుతర బాధ్యత మనందరి పైన ఉన్నందున అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ హితవు పలికారు. ప్రభుత్వం నిర్దేశించిన ఇంటింటి ఆరోగ్యం సర్వే ప్రణాళికా బద్దంగా చేపట్టి నూటికి నూరు శాతం విజయవంతం చేయాలని, కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి స్థాయి లక్ష్యాన్ని సాధించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ అవుట్ పేషంట్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ వైద్య వసతులను మెరుగుపర్చుకోవాలని, మాక్లూర్ లోని ఐసోలేషన్ సెంటర్ ను పునః ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పై నాలుగు అంశాల అమలులో ఎవరైనా అలసత్వానికి తావు కల్పిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో జరిపిన ఇంటింటి సర్వే ఎంతో సత్ఫలితాలు అందించిందని, ప్రస్తుతం కూడా అదే స్పూర్తితో ఇంటింటి ఆరోగ్యం సర్వే చేపట్టి విజయవంతం చేయాలన్నారు. రేపు ఉదయం నుండే సర్వే ను ప్రారంభించి నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని, అన్ని గ్రామపంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో ఏ ఒక్క నివాస గృహం కూడా మినహాయించబడకుండా ప్రత్యేక బృందాలతో డోర్ తో డోర్ సర్వే జరిపించాలన్నారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, ఎస్ హెచ్ వోలతో బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, పంచాయతీల పరిధిలో జీపీ కార్యదర్శులు, ఆశ వర్కర్ లేదా ఏ ఎన్ ఏం, మునిసిపల్ సిబ్బంది, ఆర్ పీ లతో బృందాలు నెలకొల్పాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో జరిగే సర్వే ను ప్రధానంగా ఏం పీ డీ ఓ లు, పట్టణాల్లో వార్డుల వారీగా జరిగే సర్వే ను మునిసిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని అన్నారు. ఆయా ప్రాంతాల్లో నివాస గృహాల సంఖ్యను బట్టి నాలుగైదు చొప్పున బృందాలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఈ బృందాలు ఇంటింటికి తిరుగుతూ జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలతో బాధపడుతున్న వారిని, శ్వాస సంబంధిత సమస్యలతో ఉన్న వారిని గుర్తించి అలాంటివారికి అప్పటికప్పుడే హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్ అందజేయాలని అన్నారు. ఇంటింటి సర్వే వివరాలను రోజువారీగా నిర్ణీత నమూనాలో సేకరించి ప్రతి రోజు సాయంత్రం తనకు నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కాగా, కొవిడ్ నియంత్రణ కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మొదటి విడత వ్యాక్సినేషన్ లో 97 శాతం, రెండవ విడతలో 77 శాతం లక్ష్యం పూర్తయ్యిందని, మిగతా లక్ష్యాన్ని కూడా పూర్తి చేసేందుకు చొరవ చూపాలన్నారు. ముఖ్యంగా 15 - 17 సంవత్సరాల లోపు వారికి అందిస్తున్న వ్యాక్సినేషన్లో కేవలం 64 శాతం తో వెనుకబడి ఉన్నామని, ప్రికాషనరీ డోస్ ఇవ్వడంలోనూ ప్రగతి అంతంత మాత్రంగానే ఉందని కలెక్టర్ పెదవి విరిచారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్, 50 సంవత్సరాలు దాటిన వారందరికీ తప్పనిసరిగా ప్రికాషనరీ డోస్ ఇవ్వాలని, మెడికల్, పోలీస్, పంచాయతీరాజ్, అంగన్వాడీ, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల సిబ్బంది అందరికి వాక్సినేషన్ అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వే కోసం ఏర్పాటు చేస్తున్న బృందాలలో ఆశ వర్కర్లను, ఏ ఎన్ ఏం లను ఏర్పాటు చేసినట్లయితే అటు ఇంటింటి సర్వేతో పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఏకకాలంలో పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలోని అన్ని పీ హెచ్ సీలు మొదలుకుని అన్ని ఆసుపత్రుల్లోనూ ప్రత్యేకంగా కొవిడ్ అవుట్ పేషంట్ విభాగాన్ని రేపటి నుండి ప్రారంభించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. కొవిడ్ లక్షణాలతో వచ్చేవారికి క్షుణ్ణంగా ఆరోగ్య పరీక్షలు జరిపి అవసరమైన వారికి మందులు అందించాలని సూచించారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు రెఫర్ చేయాలని అన్నారు. ఆసుపత్రుల్లో కొవిడ్ వార్డులను సరిచూసుకుని అన్ని విధాలుగా సిద్ధం చేయాలని, కొవిడ్ కేసులు ఎన్ని వచ్చిన సమర్ధవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధం అయ్యి ఉండాలన్నారు. అంబులెన్సు, ఆక్సిజన్, అవసరమైన మందులు, బెడ్లు వంటి సదుపాయాలను మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా మాక్లూర్ మండలంలోని ఐసోలేషన్ కేంద్రాన్ని సిద్ధం చేయాలని, దానిని ఎప్పుడు ప్రారంభించాలనేది త్వరలో తెలియజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.