- అగ్రవర్ణ పేదలకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి
- వైశ్య, రెడ్డి ఫెడరేషన్ లు ఏర్పాటు చేయాలి
-ఈ నెల 30 లోగా డిమాండ్ లు నెరవేర్చకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తాం
-ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి.రామారావు
నవతెలంగాణ-మానకొండూర్
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన, నిర్లక్ష్య వైఖరి పట్ల ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన నిరసించారు. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే ఓసి సామాజిక సమాఖ్య, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రగతి భవన్ ముట్టడించడానికి వెనుకాడబోమని పొలాడి రామారావు హెచ్చరించారు. గురువారం మానకొండూర్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ఆదాయ పరిమితి సరళీకృతం చేస్తూ జారీ చేసిన ఆదేశాలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశంలో అగ్రవర్ణ పేదలకు రూ. 8 లక్షల ఆదాయ పరిమితిని సులభతరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు క్షేత్ర స్థాయి అధికారులకు అందకపోవడం వల్ల తాహశీల్దార్ కార్యాలయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం లేదన్నారు. దీంతో అర్హత ఉన్న అగ్రవర్ణ పేదలు విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కోల్పోతున్నారని మండిపడ్డారు.
త్వరలో రాష్ట్రంలో 65 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించే ఏర్పాటు చేయాలని కోరారు. ఈనెల 30వ తేదీలోగా ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేయని పక్షంలో ఓసి సమాఖ్య, ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు, నిబంధనల సడలింపు కోరుతూ హుజరాబాద్ ఉప ఎన్నికల ముందు తాను ఆమరణ నిరాహార దీక్షకు ప్రయత్నించగా, సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ లపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో దీక్ష నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ల ఆదాయ పరిమితికి సంబంధించి సరళీకృతం చేసిన ఉత్తర్వులను రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలకు పంపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాల్లో ఐదేళ్ల వయోపరిమితి సడలింపునిస్తుా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ, రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టకపోవడంతో, అర్హులైన నిరుద్యోగులు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రెడ్డి , వైశ్య కులాల ఫెడరేషన్ లు ఏర్పాటు చేసి వెంటనే ఆయా వర్గాల అభ్యున్నతికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు గోపు గోపాల్ రెడ్డి , సయ్యద్ గౌస్ పాషా , తుమ్మనపల్లి శ్రీనివాసరావు , చింతిరెడ్డి రమణారెడ్డి , బండ లక్ష్మారెడ్డి , నరహరి రాజిరెడ్డి , ఉమ్మెంతల శ్యాంసుందర్ రెడ్డి , కాళ్ల శివరాములు , దేవరాజుల మనోహర శర్మ , తదితరులు పాల్గొన్నారు .
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 12:52PM